Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు సర్వ నాశనం 7 d ago

AP: కూటమి నాయకుల వలన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్రత్యేక హోదాను మంటకలిపిన వ్యక్తి చంద్రబాబు అని, ప్రత్యేక హోదా రాకపోవడం వలన రాష్ట్రం ఎంతో నష్ట పోయిందన్నారు. పోలవరం నిర్మాణ ఎత్తు 41.15కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి అంగీకరించిందని, అందుకు సీఎం చంద్రబాబు అంగీకరించి ద్రోహానికి పాల్పడ్డారన్నారు. ప్రాజెక్టులో 45.72 వద్ద నీరు నిలిపే విధంగా నిర్మాణం చేయాలంటే అదనంగా రూ. 25 వేల కోట్లు కావాలన్నారు. ఈ నిధులను ఎగ్గొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పోలవరం ప్రాజెక్టును సర్వ నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరగుతుంటే కేంద్ర మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పోలవరం తెలుగు ప్రజల కళ అని, ఈ ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరని, ఆయన చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిల సింహభాగాన్ని పోషిస్తున్నారని తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించాలి తప్పా.. జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబుకు ఉపయోగకరమైన రాజకీయాలు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ, షర్మిల ఉన్నారని పేర్కొన్నారు.